India Lose An International Match Despite Virat Kohli’s Century | రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ సెంచరీలు చేసినా భారత్ కు ఓటమి తప్పలేదు. వన్డేల్లో కోహ్లీ ఇప్పటివరకు 53 సెంచరీలు చేశారు. ఈ 53 మ్యాచుల్లో టీం ఇండియా ఎనమిది మ్యాచులను ఓడింది. రాయపూర్ వేదికగా జరిగిన రెండవ వన్డేలో టీం ఇండియా ఓటమిని చవిచూసింది. భారీ లక్ష్య చేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా నాలుగు బంతులు మిగిలుండగానే, నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 358 పరుగులు చేసింది. ఈ క్రమంలో కోహ్లీ 102 పరుగులు చేశారు.
ఈ సెంచరీతో అతను వన్డే ఫార్మాట్ లో 53 సెంచరీలను పూర్తి చేసుకున్నారు. అయినప్పటికీ భారత్ ఓడింది. కోహ్లీ సెంచరీ చేస్తే మ్యాచ్ గెలవడం ఖాయం అనే భావన అభిమానుల్లో ఉంది. కానీ ఈ సారి అలా జరగలేదు. గతంలోనూ కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ ఏడు మ్యాచుల్లో టీం ఇండియా ఓడింది. తాజగా ఇది ఎనిమిదవది. 2019 మార్చిలో రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో కోహ్లీ 123 పరుగులు చేసినప్పటికీ టీం ఇండియా ఓడింది. మళ్లీ ఆరు సంవత్సరాల ఎనమిది నెలల తర్వాత కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ ప్రత్యర్థి జట్టే విజయం సాధించింది.









