Telangana CM Reddy Invites PM Modi To Attend Telangana Rising Global Summit | హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీ వేదికగా డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో పాల్గొనాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
సీఎం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఢిల్లీ పార్లమెంట్ భవన్‌లోని ప్రధానమంత్రి కార్యాలయంలో మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత వికసిత్ భారత్ – 2047 లక్ష్యాలకు అనుగుణంగా, తెలంగాణ వంతుగా దేశ ఆర్థిక ప్రగతిలో తోడ్పాటును అందించాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం రూపొందించినట్టు ముఖ్యమంత్రి వివరించారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని సమగ్రమైన ప్రణాళికలతో రోడ్ మ్యాప్‌ను రూపొందించినట్టు చెప్పారు. వివిధ రంగాల్లో నిష్ణాతులు, నిపుణులు, నీతి ఆయోగ్ సలహా సూచనలను క్రోడీకరించి మేధోమథనం అనంతరం విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినట్టు చెప్పారు. అలాగే తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు అనుగుణంగా ఫలితాలు సాధించడంలో, అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహాకారాలు అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కోరారు.









