Kavitha Strong Counter to Pawan Kalyan | ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ తెలంగాణకు వ్యతిరేకమే అని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆమె బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతోనే కోనసీమ పాడైపోయిందని పవన్ అంటున్నారని కానీ తెలంగాణ వాళ్ళు ఏనాడూ దిష్టి పెట్టలేదన్నారు. కోనసీమ బాగుంది, కోనసీమలా తెలంగాణ మారాలని మాత్రమే కోరుకున్నట్లు చెప్పారు.
తమ నినాదమే జై తెలంగాణ, జై ఆంధ్ర అని ఉభయ రాష్ట్రాలు బాగుండాలని కోరుకున్నట్లు కవిత తెలిపారు. తాను ప్రత్యేకంగా ఏపీకి ప్రత్యేక హోదా గురించి లోకసభలో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. పక్కవాడు చెడిపోవాలని కోరుకునే స్వభావం తెలంగాణకు లేదన్నారు. ఉద్యమ సమయంలో ఒకవేళ ఇలాంటి ఆలోచనే ఉంటే ఉద్యమ స్వభావమే మరోలా ఉండేదన్నారు. ఉద్యమ సమయంలో కానీ ఇప్పుడు కానీ తెలంగాణా వాళ్ళు ఎప్పుడూ పరాయి రాష్ట్రం వ్యక్తి మీద ఏనాడూ చెయ్యెత్త లేదని, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించుకోవలన్నారు కవిత. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించి చేయాలని కవిత సూచించారు.









