Telangana CM Asks Officials To Control Stray Dogs After Speech-Impaired Boy Attacked In Hyderabad |హైదరాబాద్ లో పిల్లలపై వీధి కుక్కల దాడులు అధికం అయ్యాయి. ఎల్బీనగర్ మన్సూరాబాద్ లోని శివగంగ కాలనీలో వీధి కుక్కల దాడిలో మూగ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతి రావు, చంద్రకళ దంపతులు కాలనీలో ఉంటున్నారు. వీరి కుమారుడు ప్రేమ్ చంద్ పుట్టుకతో మూగ.
మంగళవారం ఉదయం ఇంటి నుంచి వీధిలోకి వచ్చిన ప్రేమ్ చంద్ పై ఒక్కసారిగా 15 నుంచి 20 వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ క్రమంలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. చెవి తెగింది. తలపై తీవ్రంగా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం బాలుడు నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. బాలుడి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎంఓ అధికారులతో మాట్లాడి బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అదేశించారు.
బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాలుడికి అవసరమైన తక్షణ సాయం అందించాలని, ఆసుపత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించడంతో పాటు కుటుంబ సభ్యులను కలిసి వారి బాగోగులు తెలుసుకోవాలని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. తక్షణం వీధి కుక్కల కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు.









