Minister Ponnam Fires On AP Deputy Cm Pawan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై నిప్పులుచెరిగారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. కాగా పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో తెలంగాణ మంత్రులు పవన్ పై మండిపడుతున్నారు. తాజగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల భావంతో ఉండే రాష్ట్రాలన్నారు. తెలంగాణ తుఫాన్ లో మునుగుతుంటే ప్రకృతి అనుకున్నాం తప్ప ఆంధ్రప్రదేశ్ ను తప్పుపట్టలేదన్నారు. అలాగే ఎక్కడో కోనసీమ లో కొబ్బరి చెట్లు ఎండిపోతే ఆంధ్రప్రదేశ్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అంటే ఆయన వివేకవంతుడ.. లేక అవివేకవంతుడా అని నిలదీశారు. మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ బీజేపీ నాయకత్వం పవన్ వ్యాఖ్యలపై స్పందించాలని కోరారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్పందించాలన్నారు. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే దిష్టి తగిలిందని నిందించడం తెలంగాణ ప్రజలకు అవమానకరం అని పేర్కొన్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ తన మాటలు ఉప సంహరించుకోవాలని క్షమాపణలు కోరాలి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి వివక్షపూరిత మాటలు మాట్లాడవద్దని విజ్ఞతగా వ్యవహరించాలని పవన్ కు పొన్నం హితవుపలికారు.









