Murder Accused JDU ‘Bahubali’ Anant Singh Wins In Bihar’s Mokama | ఉత్తరప్రదేశ్, బీహార్ లో ఎన్నికలు అనగానే ‘బాహుబలి నేతలు’ చర్చనీయాంశంగా మారుతారు. ఇలా బీహార్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన బాహుబలి ఘన విజయం సాధించారు.
ఎన్నికల కంటే కొన్నిరోజుల ముందే మర్డర్ కేసులో జైలుకెళ్లిన అనంత్ సింగ్, మోఖమా స్థానం నుండి ఏకంగా 28 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈయన జేడీయూ తరఫున పోటీ చేశారు. ప్రశాంత్ కిషోర్ పార్టీకి చెందిన మద్దతుదారుడిని తుపాకీతో కాల్చి హత్య చేసిన కేసులో అనంత్ సింగ్ ను నవంబర్ 2న పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ నేత జైలులోనే ఉన్నారు. అయినప్పటికీ తన ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవిని 28 వేల ఓట్ల తేడాతో ఓడించడం గమనార్హం.
అనంత్ సింగ్ పై 28కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. మోఖమా స్థానంలో ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రియదర్శిని పీయూష్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్న నేతగా మారిన గ్యాంగస్టర్ దులార్ సింగ్ యాదవ్ ను కొందరు కాల్చి హత్య చేశారు. ఈ కేసులో అనంత్ సింగ్ ను అరెస్ట్ చేశారు. ఇకపోతే 2005 నుంచి మోఖమాలో అనంత్ సింగ్ ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు. 2022లో మాత్రం అక్రమ ఆయుధాల కేసులో అనంత్ సింగ్ దోషిగా తేలడంతో అతని ఎన్నిక రద్దయ్యింది. ఈ క్రమంలో జరిగిన ఉప ఎన్నికలో అనంత్ సింగ్ భార్య నీలం దేవి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదిలా ఉండగా ఎన్నికల అఫిడవిట్ లో అనంత్ సింగ్ రూ.100 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించారు.









