Bihar exit poll results 2025 | బీహార్ శాసనసభ ఎన్నికలు ముగిశాయి. 243 స్థానాలకు గాను నవంబర్ 6, నవంబర్ 11న రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 65.9 శాతం ఓటింగ్ నమోదవ్వగా 122 స్థానాల కోసం జరిగిన రెండవ విడత ఎన్నికల్లో సాయంత్రం ఐదు గంటల వరకే ఏకంగా 67.14 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు తెలుస్తోంది. 25 ఏళ్లలో ఇదే అధికం కావడం విశేషం.
ఇకపోతే బీజేపీ, జేడీయూ,ఎల్జేపీ, హిందుస్థాని అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక మోర్చా పార్టీలు కలిసి ఎన్డీయే కూటమిగా, మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, వీఐపీ మరియు ఇతర చిన్న పార్టీలు కలిసి మహాఘడ్భంధన్ గా పోటీ చేశాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది. మంగళవారం ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి.
అయితే అన్నీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమే తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అని అంచనా వేశాయి. 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో 122 మ్యాజిక్ ఫిగర్. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఎన్డీయేకు 133 నుంచి 167 వరకు మహా ఘడ్భంధన్ కు 70 నుంచి 102 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. POLSTRAT ప్రకారం ఎన్డీయేకు 133-148 సీట్లు, మహా ఘడ్భంధన్ కు 87-102 సీట్లు, ఇతరులకు 3-5 సీట్లు వస్తాయని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ విషయానికి వస్తే ఎన్డీయే కు 133-159, మహా ఘడ్భంధన్ కు 75-101, జన్ సురాజ్ పార్టీకి 0-5 సీట్లు, ఇతరులకు 2-8 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
దైనిక్ భాస్కర్ ప్రకారం ఎన్డీయేకు 145-160, మహా ఘడ్భంధన్ 73-91, ఇతరులకు 5-10 వస్తాయని అంచనా వేసింది. పీపుల్స్ ఇన్సైట్ సంస్థ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీయే 133-148 , మహా ఘడ్భంధన్ 87-102, ప్రశాంత్ కిషోర్ పార్టీకి 0-2 సీట్లు, ఇతరులకు 3-6 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇకపోతే ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి.









