Taiwanese serum regrows hair in 20 days | బాల్డ్ నెస్, వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలతో అనేక మంది మానసికంగా తీవ్ర బాధను ఎదుర్కుంటారు. ఇలాంటి వారికి తైవాన్ దేశ శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. కేవలం 20 రోజుల్లోనే జుట్టు తిరిగి వచ్చే విధంగా ఒక సిరమ్ ను అభివృద్ధి చేశారు.
ఇప్పటికే ఎలుకపై దీనిని ప్రయోగించిగా విజయవంతం అయ్యింది. ఇది బాల్డ్ నెస్ చికిత్సలో కీలక మైలురాయి అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తైవాన్ దేశంలోని నేషనల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ సుంగ్ జాన్ లిన్ నేతృత్వంలో బొటానికల్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఒక ఎలుకపై వెంట్రుకలను పూర్తిగా తొలగించిన తర్వాత వారు రూపొందించిన సిరమ్ ను అప్లై చేశారు. 20 రోజుల్లోనే వెంట్రుకలు తిరిగి రావడం విశేషం. అలాగే ప్రొఫెసర్ లిన్ ఈ సిరమ్ ను తన తొడలపై కూడా ఉపయోగించారు. సిరమ్ అద్భుతంగా పనిచేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ సిరమ్ కు పేటెంట్ కూడా దక్కింది. తాజగా మానవ ట్రయల్స్ ను ప్రారంభించేందుకు సిద్ధం అయ్యారు. ఒకవేళ మానవులపై కూడా ఇది సక్సెస్ అయితే అతి త్వరలోనే ఈ సిరమ్ మార్కెట్ లోకి వస్తుంది. ప్రస్తుతానికి ఈ సిరమ్ మూలంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తెలుస్తోంది. ఈ విషయాలను అంతర్జాతీయ మీడియా తన కథనాల్లో పేర్కొంది.









