Tuni Man Accused Of Rape Dies | కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారయత్నంకు సంబంధించిన కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడు అయిన నారాయణరావు చెరువులో దూకి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
అత్యాచారాయత్న ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. అతడిపై పొక్సో కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి కోర్టుకు బయలుదేరారు. అయితే తనకు మూత్ర విసర్జన వస్తుందని నిందితుడు చెప్పడంతో తాము కోమటిచెరువు వద్ద వాహనాన్ని ఆపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో చెరువు వద్దకు వెళ్లిన వృద్ధుడు అందులో పడిపోయాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు అందులో పడ్డాడా అనేది తెలియాల్సి ఉంది.
చెరువులో పడ్డ నారాయణరావు కోసం గజ ఇతగాళ్ళు రంగంలోకి దిగారు. గురువారం ఉదయం అతడి మృతదేహం లభ్యం అయ్యింది. జగన్నాథగిరిలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న ఓ బాలికకు మాయమాటలు చెప్పి నారాయణరావు తనతో పాటు తీసుకెళ్లాడు. అంతకంటే ముందు బాలికకు మాయ మాటలు చెప్పి, తినుబండారాలు కొనిపెట్టి దగ్గరయ్యాడు. ఆ తర్వాత పాఠశాలకు వెళ్లి బాలికకు తాను తాతను అని సిబ్బంది వద్ద నమ్మబలికినట్లు, ఆ తర్వాత బాలికను బయటకు తీసుకొని వెళ్లి తొండంగి సమీపంలోని ఓ తోటలో అత్యాచారయత్నానికి ఒడిగట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఓ స్థానికుడు ఇది గమనించి బాలికను రక్షించాడు.









