Helicopter carrying President gets stuck on helipad during Sabarimala visit | కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తృటిలో ముప్పు తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో చిన్నపాటి ప్రమాదానికి గురయ్యింది.
ల్యాండ్ అయ్యే సమయంలో హెలిప్యాడ్ కుంగిపోవడంతో హెలికాప్టర్ టైర్ ఇరుక్కుపోయింది. అయితే తక్షణమే స్పందించిన సిబ్బంది రాష్ట్రపతిని సురక్షితంగా కిందకు దింపారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి కేరళ లోని తిరువనంతపురంకు చేరుకున్నారు. బుధవారం ఉదయం శబరిమల పర్యటనకు వెళ్లారు. రాష్ట్రపతి ప్రయాణించే హెలికాప్టర్ పంబ సమీపంలోని నీలక్కల్ వద్ద దిగాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ల్యాండింగ్ ప్రదేశాన్ని మార్చారు.
ఈ క్రమంలో ప్రమదం ప్రాంతంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో మంగళవారం రాత్రి హెలిప్యాడ్ ను సిద్ధం చేశారు. అయితే కాంక్రీట్ పూర్తిగా ఆరలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడగానే హెలిప్యాడ్ కుంగిపోయింది. హెలికాప్టర్ టైర్ అందులో ఇరుక్కుపోయింది. సురక్షితంగా రాష్ట్రపతి కిందకు దిగి అనంతరం రోడ్డు మార్గాన పంబకు బయలుదేరారు. మరోవైపు హెలికాప్టర్ ను బయటకు తీసేందుకు భద్రతా సిబ్బంది, పోలీసులు మరియు ఇతరులు హెలికాప్టర్ ను తోస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి.









