Agra-Lucknow Expressway toll plaza employees refuse to collect toll | దీపావళి పండుగ నేపథ్యంలో వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు బోనస్ కోసం వేచి చూస్తారు. అయితే కంపెనీ బోనస్ విషయంలో మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు ఏకంగా టోల్ ప్లాజా గేట్లను ఎత్తేసి ఉచితంగానే వాహనాలను వెళ్ళనిచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
ఉద్యోగుల నిరసనతో సుమారు మూడు గంటల పాటు వాహనాలు ఎలాంటి టోల్ ఫీజు చెల్లించకుండానే వెళ్లిపోయాయి. యూపీలో ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వే అత్యంత రద్దీగా ఉంటుంది. ఫతేహబాద్ లో ఈ ఎక్స్ ప్రెస్ వే పై టోల్ ప్లాజా ఉంది. దీనిని శ్రీ సైన్ అండ్ డాటర్స్ అనే కంపెనీ నిర్వహిస్తోంది. ఇక్కడ 21 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తారు. అయితే దీపావళి సందర్భంగా ఉద్యోగులకు కేవలం రూ.1100 బోనస్ మాత్రమే లభించింది. దింతో ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విధులను బహిష్కరించి నిరసనకు దిగారు. నిరసనలో భాగంగా టోల్ ప్లాజా గేట్లు ఎత్తేశారు.
ఈ క్రమంలో వేల సంఖ్యలో వాహనాలు ఎలాంటి రుసుమును చెల్లించకుండానే వెళ్లిపోయాయి. విషయం తెలుసుకున్న యాజమాన్యం వేరే టోల్ ప్లాజా నుండి ఉద్యోగులను తరలించే ప్రయత్నం చేసింది. కానీ ఫతేహబాద్ లోని ఉద్యోగులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. అనంతరం యాజమాన్యం ఉద్యోగులతో చర్చలు జరిపి 10 శాతం జీతాన్ని పెంచుతామని హామీ ఇచ్చింది. దింతో ఉద్యోగులు ఆందోళన వీడి తిరిగి పనికెక్కారు.









