Bandi Sanjay’s Warning to Telangana Political Leaders | మావోయిస్టు పార్టీలో అనేక చీలికలు వచ్చాయని, ఇలా చీలిన ఓ వర్గంతో తెలంగాణలోని కొందరు రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయని ఇటీవలే జనజీవన స్రవంతిలో కలిసిన మల్లోజుల వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ఇదే సమయంలో ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూ కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన జారీ చేశారు. బహిరంగ వేదికలపై ప్రజాస్వామ్యాన్ని బోధించే నేతలు మావోయిస్టుల సాయుధ దళాలతో వెంటనే సంబంధాలు తెంచుకోవాలని లేదంటే బహిర్గతం అయ్యేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. మావోయిస్టులను ఏరివేయడానికి ఏర్పాటు చేసిన కేంద్ర ఏజెన్సీలు మావోయిస్టు కార్యకర్తల వద్దే ఆగిపోవని, ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవినీతి, నేరాలు, తీవ్రవాద సంబంధాలను కాపాడుతున్న వారిని కూడా వెంటాడుతాయని కీలక వ్యాఖ్యలు చేశారు.
అలాంటి వారి పట్ల ఎలాంటి కనికరం, ఉదాసీనత లేకుండా నిర్మూలించడానికి కూడా వెనుకాడేదే లేదని తేల్చి చెప్పారు. మావోలతో కలిసి దేశ అంతర్గత భద్రతకు విఘాతం కలిగించాలని భావిస్తే ఎంతపెద్ద నాయకులైనా అధర్మం వైపు నిల్చుంటే కూలిపోవాల్సిందేనని తేల్చి చెప్పారు. మావోలతో సంబంధాలు ఉన్న తెలంగాణ రాజకీయ నేతలు దీన్ని ఓ హెచ్చరికలా భావించాలని బండి ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ కలకలం రేపింది.









