BRS Party Will Support To BC JAC Bandh Says KTR | బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అక్టోబర్ 18న తెలంగాణ బంద్ ను నిర్వహించనున్నట్లు బీసీ సంఘాలు ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలోని బీసీ సంఘాల బృందం బుధవారం బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి బంద్ కు మద్దతును కోరాయి.
ఈ నేపథ్యంలో బీసీల 42% రిజర్వేషన్ కోసం తలపెట్టిన బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ నైతిక మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ తెచ్చిన 42% రిజర్వేషన్ కేవలం స్థానిక సంస్థల కోసం తీసుకువచ్చారు కానీ, విద్య, ఉపాధికి సంబంధించిన రిజర్వేషన్ల వాటా మిగిలిన అన్ని రంగాల్లో రావాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చిత్తశుద్ధి లేని శివపూజ వలే ఉందన్నారు.
రేవంత్ రెడ్డికి బీసీల అంశంలో ఎలాంటి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రధాని మోదీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ ఇద్దరూ కలిసి ఒక్క మాట అంటే ఒక్క నిమిషంలో బీసీ రిజర్వేషన్ల అంశం తేలిపోతుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి స్వయంగా ఓబీసీ కాబట్టి, ఆయనకి బీసీ రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉంటే మంచిదని చెప్పారు.









