Telangana Rural Local Body polls schedule released | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను సోమవారం ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో మొత్తం ఐదు దశల్లో స్థానిక ఎన్నికలు జరపనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని 5,749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.
1.67 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవిష్యత్ ను నిర్ణయించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడత ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 9న నామినేషన్ల స్వీకరణ, అక్టోబర్ 23న ఎన్నికలు జరగనున్నాయి. ఇకపోతే రెండవ విడతకు సంబంధించి అక్టోబర్ 13న నామినేషన్ల స్వీకరణ, అక్టోబర్ 27న ఎన్నికలు జరుగుతాయి.
రెండు విడతలకు ఒకేసారి నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4, మూడవ విడత నవంబర్ 8న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది.









