Ys Sharmila Fires On PM Modi | నెక్ట్స్ జెన్ జీఎస్టీ సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల జీఎస్టీ అంశంలో ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులుచెరిగారు. GST తో దోచింది చేసింది కొండంత అయితే తగ్గించింది గోరంత అని విమర్శించారు.
8 ఏళ్లలో మోదీ మోపిన గబ్బర్ సింగ్ ట్యాక్స్ భారం అక్షరాల 55.44 లక్షల కోట్లు అని పేర్కొన్నారు. కానీ 2.O సంస్కరణల ముసుగులో తగ్గింపు విలువ కేవలం 2.5లక్షల కోట్లు అనే మండిపడ్డారు. GST పేరుతో చేసిన లోతైన గాయానికి అయింట్మెంట్ రాయాలని చూసే బీజేపీ బ్యాండ్ – ఎయిడ్ రాజకీయాలను దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరని తెలిపారు.
GST పై మోదీవి జిత్తులమారి వేషాలు అని షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. ఇన్నాళ్లు పన్నుల మోత మోగించి, సామాన్యులను గుల్ల చేసి, ఇప్పుడేదో నవశకం ఆరంభమని, నవతరమని, ఆత్మనిర్భరత లాంటి శుద్ధపూస మాటలు ప్రధాని మాట్లాడుతుంటే..వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేపట్టిన సామెత నిజంగా గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. GST తాజా సంస్కరణలు బీజేపీ చేసిన ఆర్థిక గాయాలను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం కోసమే అని అన్నారు.









