Modi Says Good News | భారతదేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం (79th Independence Day) సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన దేశ ప్రజలకు ఓ శుభవార్త చెప్పారు.
దీపావళి లోగా సామాన్యులకు ఓ బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇందులో కొత్త తరం జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) సంస్కరణలు ఉంటాయని తెలిపారు. రోజువారీగా వినియోగించే పలు రకాల వస్తువులు, నిత్యవసరాలపై పన్ను రేట్లు తగ్గిస్తామని ప్రధాని వెల్లడించారు.
ఇందుకోసం అన్ని రాష్ట్రాలతో చర్చించి.. జీఎస్టీ విధానంలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలిపారు. సామాన్యులకు వీటిని కానుకగా ఇస్తామని చెప్పారు. కొత్త తరం జీఎస్టీ సంస్కరణలతో చిన్న పరిశ్రమలు, MSME లకు గణనీయ ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
ప్రజలు రోజువారీగా వినియోగించే వస్తువులు మరింత చౌకగా మారుతాయని.. అందుకు అనుగుణంగా వాటిపై జీఎస్టీ రేట్లను తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అదే విధంగా లక్ష కోట్ల రూపాయలతో ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన పథకాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. తద్వారా రానున్న రెండేళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పారు.









