అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మరణించారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు కారు ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా బక్రి చెప్యాల చెందిన రోహిత్ రెడ్డి, భార్య ప్రగతి రెడ్డి, ఇద్దరు కుమారులు, తల్లి సునీతతో అమెరికాలోని ఫ్లోరిడాలో నివాసం ఉంటున్నారు. రోహిత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రోహిత్ రెడ్డి భార్య ప్రగతి రెడ్డి, పెద్దకుమారుడు అర్విన్, తల్లి సునీత అక్కడికక్కడే మృతిచెందారు.
రోహిత్ రెడ్డి, చిన్నకుమారుడు గాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో రోహిత్ కారు నడిపారు. ఈ ప్రమాదంతో ప్రగతి రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా టేకులపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సమాచారం తెలిసిన వెంటనే ప్రగతి రెడ్డి తల్లిదండ్రులు మోహన్ రెడ్డి, పవిత్రాదేవి అమెరికాకు బయల్దేరారు. మృతులకు ఫ్లోరిడాలోనే దహన సంస్కారాలు చేస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.