11-year-old boy fights off leopard in Palghar forest | చిరుత వెనుక నుంచి దాడి చేసింది. అయినప్పటికీ ఏ మాత్రం భయపడకుండా చిరుతనే ఎదురించాడు ఓ 11 ఏళ్ల బాలుడు. ఈ ఘటన మహారాష్ట్ర లోని పాల్ఘర్ జిల్లా విక్రమ్ ఘడ్ తాలూకాలోని మాలా పద్వీపాడ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 ఏళ్ల విష్ణు కువారా అసాధారణ ధైర్యంతో తన ప్రాణాలను కాపాడుకున్నాడు.
అతడికి తోడుగా స్నేహితులు, గ్రామస్థులు రావడంతో చిరుత తోకముడిచి అడవిలోకి జారుకుంది. స్థానిక ఉతావలి ఆదర్శ విద్యాలయలో విష్ణు కువారా అనే బాలుడు ఐదవ తరగతి చదువుతున్నాడు.శుక్రవారం సాయంత్రం పాఠశాల అయిపోయాక స్నేహితులతో కలిసి ఇంటికి బయలుదేరాడు. ఈ మార్గం అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇలా కువారా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అప్పటికే పొదల్లో నక్కిన చిరుత ఒక్కసారిగా బాలుడిపై దాడి చేసింది. అదృష్టవశాత్తూ కువారా వేసుకున్న స్కూలు బ్యాగుపై చిరుత పంజా విసిరింది.
ఈ క్రమంలో చిరుతను చూసి కువారా భయపడకుండా గట్టిగా కేకలు వేస్తూ, రాళ్లు విసిరాడు. కొద్దీ దూరంలోనే ఉన్న ఇతర విద్యార్ధులు సైతం రాళ్లు విసిరారు. ఇలా రాళ్లు విసురుతూ కువారా మరియు అతడి స్నేహితుడు చిరుతను ఎదురించాడు. పిల్లల కేకలు విన్న గ్రామస్థులు రావడంతో చిరుత పారిపోయింది. అనంతరం కువారా చేతికి గాయం కావడంతో అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.









