Nara lokesh News Latest | వ్యక్తిగత విమర్శలు, రాజకీయ దాడులు మంచివి కావని హితవుపలికారు మంత్రి నారా లోకేశ్. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సంబంధించిన ఒక ఏఐ వీడియో పై స్పందించిన లోకేశ్ ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో జగన్ ప్రతిపక్ష హోదా కోసం అభ్యర్ధిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. దీనిని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ క్రమంలో స్పందించిన లోకేశ్ ఇలాంటి కంటెంట్ వెనక ఉన్న భావోద్వేగాన్ని తాను అర్థం చేసుకోగలనని, కానీ వ్యక్తిగత దాడులు ఎప్పటికీ మంచివి కావని టీడీపీ శ్రేణులకు సూచించారు. రాజకీయ ప్రత్యర్థులమైనప్పటికీ, విమర్శలు, చర్చలు గౌరవం, మర్యాదతో కూడినదిగా ఉండాలన్నారు. ఇలాంటి కంటెంట్‌ను వ్యాప్తి చేయడం మానుకోవాలని టీడీపీ అభిమానులకు, మద్దతుదారులకు లోకేశ్ విజ్ఞప్తి చేశారు. విభేదాలు ఉన్నప్పటికీ మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను బలోపేతం చేసే నిర్మాణాత్మక రాజకీయాలపైనే దృష్టి పెట్టాలని సూచనలు చేశారు.









